వరుణుడి బ్యాటింగ్‌


ఆమ్లా ఎంతసేపు నిలుస్తాడు.. డివిలియర్స్‌ ఎంత కొడతాడు.. డుప్లెసిస్‌ ఎలా ఆడతాడు.. పాండ్య జోరు కొనసాగిస్తాడా.. భువనేశ్వర్‌ మళ్లీ లయ అందుకుంటాడా.. బుమ్రా పుంజుకుంటాడా.. పరిస్థితుల్ని భారత బౌలర్లు ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారు.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఎంతసేపు సాగుతుంది.. ఆధిక్యం ఎంతకు పెరుగుతుంది.. భారత్‌ ముందు ఎంత లక్ష్యం నిలుస్తుంది.. మూడో రోజే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలవుతుందా.. ఈసారి మన బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారు.. ఆట ఆఖరుకు మ్యాచ్‌ ఫలితమేంటో నిర్ణయమైపోతుందా.. ఇలా ఆదివారం ఆట ఆరంభానికి ముందు ఎన్నెన్నో విశ్లేషణలు.. చర్చోపచర్చలు.. ఊహాగానాలు! కానీ వాటన్నింటికీ తెరదించేశాడు వరుణుడు. ఆటగాళ్లను మైదానంలోకి రానివ్వకుండా తానొక్కడే రోజంతా ఆడుకున్నాడు. భారత్‌-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో మూడో రోజు ఆట పూర్తిగా రద్దయింది.
ఆసక్తికరంగా సాగుతున్న భారత్‌-దక్షిణాఫ్రికా రెండో టెస్టుకు వరుణుడు బ్రేక్‌ వేశాడు. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. శనివారం రాత్రి నుంచే వర్షం పడుతుండగా.. ఉదయం మరింత జోరందుకుంది. తొలి సెషన్‌ అంతా వర్షం పడుతూనే ఉంది. లంచ్‌ విరామ సమయానికి కొంచెం తెరపినివ్వడంతో మైదాన సిబ్బంది రంగంలోకి దిగారు. సూపర్‌ సాపర్లతో నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. రెండో సెషన్‌ నుంచి ఆట మొదలవుతుందని భావిస్తుండగా.. మళ్లీ వర్షం జోరు మొదలైంది. అక్కడి నుంచి వరుణుడి దోబూచులాట సాగింది. వర్షం కొంచెం తగ్గడం.. సిబ్బంది మైదానంలోకి వచ్చి కవర్లు తొలగించడం.. అంతలోనే మళ్లీ వర్షం రావడం.. ఇలాగే కొన్ని గంటలు గడిచాయి. టీ విరామం తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు ఆట రద్దు చేయక తప్పలేదు. రెండో రోజు ఆట ఆఖరుకు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లాడి 65/2తో నిలిచిన సంగతి తెలిసిందే. హషీమ్‌ ఆమ్లా (4), కాగిసో రబాడ (2) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు మార్‌క్రమ్‌ (34), ఎల్గర్‌ (25) ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 286 పరుగులు చేయగా.. భారత్‌ 209 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

అయినా ఫలితం ఖాయమే!:
ఒక రోజు ఆట పూర్తిగా రద్దయినప్పటికీ తొలి టెస్టులో ఫలితం రావడానికి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కేప్‌టౌన్‌లో సోమవారం వర్షం పడే సూచనలు లేవు. ఆట యధావిధిగా ఆరంభమయ్యే అవకాశముంది. ఇప్పటికే రెండు ఇన్నింగ్స్‌లు ముగిశాయి. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లోనూ 2 వికెట్లు పడిపోయాయి. ఆ జట్టు ఆలౌట్‌ అయినా కాకపోయినా.. నాలుగో రోజు చివరి గంటలో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తుండే అవకాశముంది. ఆ స్థితిలో భారత్‌ లక్ష్యాన్ని ఛేదించినా, ఆలౌట్‌ అయినా చివరి రోజు ఫలితం వచ్చేందుకే ఆస్కారం ఎక్కువ. ఈ మ్యాచ్‌లో మొదట్నుంచి బౌలర్ల ఆధిపత్యమే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్‌లు సుదీర్ఘంగా సాగకపోవచ్చు. కాబట్టి మళ్లీ వరుణుడు అడ్డం పడితే తప్ప మ్యాచ్‌లో ఫలితం రావడం ఖాయం!


సంబరాల్లో కేప్‌టౌన్‌: భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టులో ఒక రోజంతా ఆట రద్దవడం క్రికెట్‌ ప్రియుల్ని నిరాశకు గురి చేసినప్పటికీ.. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న కేప్‌టౌన్‌ నగరంలో లేక లేక వర్షం పడే సరికి స్థానికుల ఆనందానికి అవధుల్లేవు. ఈ నగరం మూడేళ్లుగా సరిపడా వర్షాలు లేక కరవుతో ఇబ్బంది పడుతోంది. ఇక్కడ నీటి సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇలాంటి స్థితిలో వర్షా కాలం కాకపోయినప్పటికీ ఇప్పుడు అనుకోని విధంగా వరుణుడు కరుణించడంతో స్థానికులు సంతోషంలో మునిగిపోయారు. వర్షపు నీటిని ఒడిసిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా కనిపించాయి.
రెండు రోజులు 98 ఓవర్ల చొప్పున..
వర్షం కారణంగా తొలి టెస్టు మూడో రోజు ఆట పూర్తిగా రద్దయిన నేపథ్యం ఆ నష్టాన్ని చివరి రెండు రోజుల్లో కొంతమేర భర్తీ చేయాలని అంపైర్లు నిర్ణయించారు. 4, 5 రోజుల్లో రోజుకు 98 ఓవర్ల చొప్పున ఆడించేలా నిబందనలు మార్చారు. ఐతే ఆట మాత్రం యధావిధిగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకే ఆరంభమవుతుంది. ఐతే ఈ అదనపు 8 ఓవర్లు వేసేందుకు చివరి రెండు సెషన్లను 15 నిమిషాల చొప్పున పొడిగించనున్నారు. మొత్తంగా ఆట అరగంట అదనంగా సాగుతుంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com